రజాక్ నగర్‌లో కుక్కల స్వైరవిహారం! ప్రజలపై దాడులు.. ఫిర్యాదులు ఎన్నిసార్లు చేసినా ఫలితం శూన్యం “నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం” అన్న శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు నిల్!
అనంతపురం బ్యూరో : రజాక్ నగర్‌లో వీధి కుక్కల బెడద ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గుంపులుగా సంచరిస్తున్న వీధి కుక్కలు స్థానికులపై దాడులకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు, మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
వీధి కుక్కలు, పందుల సమస్యపై స్థానికులు ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. సమస్యను శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ దృష్టికి తీసుకెళ్లగా “నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం” అంటూ హామీ ఇచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కాకపోవడంతో అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫిర్యాదులు పట్టించుకునేదెప్పుడు?
ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యపై పదేపదే ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడదతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పందుల సంచారంతో పారిశుద్ధ్య సమస్య కూడా మరింత తీవ్రమవుతోందని వాపోతున్నారు.
హామీలు ఇవ్వడం కాదు.. సమస్యను పరిష్కరించాలి అంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి రజాక్ నగర్‌లో ప్రత్యేక చర్యలు చేపట్టి వీధి కుక్కలు, పందుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.