కబ్జాదారుల కట్టడాలపై ఇరిగేషన్ కొరడా
‘సూర్య’ కథనానికి స్పందించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
పుల్లలచెరువు మేజర్ న్యూస్
పుల్లలచెరువు మండలంలోని చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న ‘సూర్య’ కథనానికి ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు స్పందించారు. చెరువుల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాలను పరిశీలించి, సంబంధిత గృహ నిర్వాహకులకు వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.చెరువులు, కాలువల పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ, ఇరిగేషన్ శాఖ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.
వెంటనే పనులు నిలిపివేత
‘సూర్య’లో వెలువడిన కథనంపై స్పందించిన ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, సంబంధిత వ్యక్తులకు పనులు నిలిపివేయాలని సూచించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగిస్తే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ఆక్రమణలకు పాల్పడినా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలపై పూర్తిస్థాయిలో పరిశీలన చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.