ఎమ్మెల్యే సాబ్.. మా ఆఖరి మజిలీకి జానెడు స్థలం చూపించండి!.
ఎమ్మెల్యే సాబ్.. మా ఆఖరి మజిలీకి జానెడు స్థలం చూపించండి!.
* స్మశాన వాటిక లేక తీవ్ర అవస్థలు పడుతున్న మంగువాయిబడవా గ్రామస్తులు.
* ఏళ్లుగా వాడుతున్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని మొక్కలు నాటిన ఫారెస్ట్ అధికారులు.
* భూమి లేని నిరుపేదలు చనిపోతే నరకయాతన.. ఇటీవలే ఓ పేద మహిళ అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు.
* ఫారెస్ట్ భూమినైనా కేటాయించి స్మశాన సమస్య తీర్చాలని గ్రామ పటేల్ విజ్ఞప్తి.
దుమ్ముగూడెం,సూర్య, మేజర్ న్యూస్..(కల్లూరి సుమన్)::
మనిషి జీవితాంతం ఎన్ని కష్టాలు పడినా,చివరికి నూరేళ్లు నిండాక ఆఖరి మజిలీ గౌరవంగా సాగాలని ఆశిస్తాడు.కానీ ఆ గ్రామంలో చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందుకు జానెడు స్థలం కూడా లేక గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారు.చావు వచ్చినా కడతేర్చే దిక్కులేక కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ హృదయవిదారక పరిస్థితి మంగువాయిబడవా గ్రామంలో హాస్టల్ గుంపులో నెలకొంది.
*మొక్కలు నాటేశారు.. స్థలం లేకుండా చేశారు:*
గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి స్థానిక గ్రామస్తులు దశాబ్దాలుగా పక్కనే ఉన్న ఫారెస్ట్ భూమినే స్మశాన వాటికగా ఉపయోగిస్తూ వచ్చారు. అయితే, ఇటీవల అటవీ శాఖ అధికారులు ఆ భూమి తమ పరిధిలోనిదని పేర్కొంటూ దాన్ని స్వాధీనం చేసుకున్నారు.అందులో మొక్కలు నాటడంతో ఇప్పుడు గ్రామంలో అంత్యక్రియలు జరపడానికి అసలు స్థలమే లేకుండా పోయింది. గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ భూమి కేటాయిస్తే ఎంతో ఉపయోగకరమని గ్రామస్తులు తెలిపారు.
*సొంత భూమి ఉన్నోళ్లకి ఓకే.. పేదల బతుకులే బుగ్గిపాలు!*
గ్రామంలో సొంత పొలాలు, భూములు ఉన్నవారు ఎవరైనా చనిపోతే తమ పొలాల్లోనే అంత్యక్రియలు కానిచ్చేస్తున్నారు.కానీ ఎలాంటి ఆస్తిపాస్తులు, భూమి లేని నిరుపేదలు మరణిస్తేనే పరిస్థితి అత్యంత దయా నీయంగా మారుతోంది.మొన్నటికి మొన్న గ్రామంలో భూమి లేని ఓ పేద మహిళ మరణిస్తే, ఆమె ఆఖరి మజిలీ కోసం స్థలం దొరక్క కుటుంబసభ్యులు, గ్రామస్తులు గంటల తరబడి పడిన అవస్థలు వర్ణనాతీతం.శవాన్ని పట్టుకుని ఎటు వెళ్లాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భూమి లేని నిరుపేదల పరిస్థితికి ఈ ఘటనే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. తమ సమీప బంధువు భూమిలో పెట్టాల్సి వచ్చిందని అన్నారు.
*అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి - గ్రామ పటేల్, కల్లూరి వెంకటేశ్వరరావు:*
ఈ సందర్భంగా గ్రామ యువకుడు రాము మాట్లాడుతూ..గ్రామంలో స్మశాన వాటిక లేకపోవడం వల్ల గ్రామస్తులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను ప్రజాప్రతినిధుల సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.లేని పక్షంలో గతంలో గ్రామస్తులు స్మశాన వాటికగా వాడుకున్న ఫారెస్ట్ భూమి నుంచైనా కొంత భాగాన్ని అంత్యక్రియల కోసం కేటాయించాలని కోరారు.
*ఎమ్మెల్యే సాబ్ స్పందించండి:*
బతికినంత కాలం ఎలాగోలా వెళ్లదీస్తున్నాం.. కనీసం చనిపోయినప్పుడైనా ప్రశాంతంగా మట్టిలో కలిసేందుకు కాస్త చోటు చూపించండి ఎమ్మెల్యే సాబ్! అని మంగువాయిబడవా గ్రామస్తులు దీనంగా వేడుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి స్థలం ఇప్పించాలని లేదా ప్రత్యామ్నాయంగా శాశ్వత స్మశాన వాటికను ఏర్పాటు చేసి నిరుపేదల ఆఖరి మజిలీ కష్టాలను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.