పరిగిలో వీధి కుక్కల బీభత్సం.. బెంబేలెత్తుతున్న కాలనీవాసులు..!
చిన్నారులపై వరుస దాడులు.. బడికి పంపాలంటేనే భయపడుతున్న తల్లిదండ్రులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని తిరుమల రెసిడెన్షియల్ కాలనీలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. కుక్కలు గుంపులుగా సంచరిస్తూ చిన్నారులపై దాడులకు పాల్పడుతుండటంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపాలన్నా, బయటకు ఆడుకునేందుకు అనుమతించాలన్నా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
రెండు రోజుల్లో రెండు ఘటనలు
కాలనీలో గత రెండు రోజులుగా చోటుచేసుకున్న వరుస ఘటనలు స్థానికులను కలవరపెడుతున్నాయి. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. అంతకుముందు రోజు మరో బాలుడి గొంతుపై కుక్క దాడికి ప్రయత్నించడంతో స్థానికులు అప్రమత్తమై కర్రలతో తరిమారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని కాలనీవాసులు చెబుతున్నారు.
అధికారులు స్పందించరా?
చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, చిన్నారులు, వృద్ధులు, పాదచారులకు రక్షణ కల్పించాలని తిరుమల రెసిడెన్షియల్ కాలనీవాసులు కోరుతున్నారు.