రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు గన్నవరం విద్యార్థిని చిన్మయి.. అండర్–19 విభాగంలో ప్లస్ 70 కేజీల కేటగిరీలో ఎంపిక.
గన్నవరం, మేజర్ న్యూస్.
గన్నవరానికి చెందిన మానికొండ సాయి సత్య చిన్మయి రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపికైంది. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి జూడో పోటీల్లో అండర్–19 విభాగం ప్లస్ 70 కేజీల కేటగిరీలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు డీఎస్‌ఏ కోచ్ శ్రీను తెలిపారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో చిన్మయి పాల్గొననుంది. నేటి కాలంలో విద్యార్థులకు ఆత్మరక్షణతోపాటు శారీరక దృఢత్వం, మానసిక సమతుల్యత, చదువులో ఏకాగ్రత పెంపొందించేందుకు జూడో వంటి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని క్రీడా రంగానికి చెందిన వారు పేర్కొన్నారు. చిన్మయి ఇప్పటికే జూడో, ఫెన్సింగ్ (కత్తియుద్ధం), తైక్వాండో, గట్కా, కురాష్ తదితర క్రీడల్లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతున్న ఆమె చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా గన్నవరం వ్యాయామ ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయకర్త డి. నాగరాజు, కె. గీత, తాన్యగిరి తదితరులు చిన్మయిని అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. చిన్మయి సాధించిన విజయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
మేజర్ న్యూస్ ప్రతినిధి :: గుర్రం ప్రసాద్ గన్నవరం, కృష్ణాజిల్లా.