పోలంపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా ముగిసిన ఖో-ఖో శిక్షణ శిబిరం క్రీడాకారులకు టీ-షర్టులు బహూకరించిన టీడీపీ మండల ఉపాధ్యక్షుడు దారెల్లి చిరంజీవి రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటాలని ఆకాంక్ష
వత్సవాయి: మండలంలోని పోలంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 12 రోజులుగా విద్యార్థులకు నిర్వహించిన ఖో-ఖో క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం లక్ష్యంగా నిర్వహించిన ఈ శిబిరం విజయవంతంగా ముగిసింది.ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు దారెల్లి చిరంజీవి క్రీడాకారులకు టీ-షర్టులను బహూకరించారు. క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు పేర్కొంటూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న నైపుణ్యాలను రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శించి విజయాలు సాధించాలని విద్యార్థులకు ఆకాంక్షించారు.ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీల్లో పోలంపల్లి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని, తద్వారా పాఠశాలకు, వత్సవాయి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నందిగామ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఉప్పులూరి గురునాథం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొక్కిలిగడ్డ జ్యోతి, పాఠశాల కమిటీ చైర్మన్ వడ్డెపూడి అప్పారావు, వైస్ చైర్మన్ దారెల్లి తిరుపతమ్మ, సీపీఎం సీనియర్ నాయకుడు మండేపూడి చంద్రశేఖర్, సొసైటీ చైర్మన్ మన్నెం బాలకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకుడు మన్నెం భాస్కరరావు, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు దారెల్లి చిరంజీవి, మాజీ ఎంపీటీసీ ఆవుల రామారావు, పాఠశాల కమిటీ సభ్యులు కాకాని గురవయ్య, కూచిపూడి దావీదు, ఆవుల తిరుపతమ్మ, గ్రామ పెద్ద వంకాయలపాటి శ్రీను, వ్యాయామ ఉపాధ్యాయుడు ధనాల రాజ్‌కుమార్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.