ఆరోగ్య భీమా కార్డుల పంపిణీ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
భారత్ 2047లో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పది మంది సీనియర్ సిటిజన్లకు బీజేపీ సీనియర్ నాయకుడు కోన సత్యనారాయణ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి రూ.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ పథకం కింద వివిధ రకాల వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందని, ఆసుపత్రిలో చేరడానికి ముందు మూడు రోజుల నుంచి, డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు నిర్దేశిత వైద్య ఖర్చులకు కవరేజీ ఉంటుందని వివరించారు.
అదేవిధంగా, 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఆదాయంతో సంబంధం లేకుండా అదనంగా రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్డుల ద్వారా పథకంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అర్హతకు అనుగుణంగా నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కార్డులను పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ‘మన ఊరు–మన జెండా’ కో-కన్వీనర్ మద్దుల సుబ్బారావు, పట్టణ బీజేపీ ఉపాధ్యక్షుడు పందిరి వీర్రాజు, బీజేపీ ప్రధాన కార్యదర్శి కోటిపల్లి కృష్ణమాచార్యులు, వై. వీర్రాజు తదితరులు పాల్గొన్నారు