11న బిజెపి ఆత్మీయ సమావేశం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్టోబర్ 11వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మండపేట నియోజకవర్గంలోని కపిలేశ్వరపురం గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ తెలిపారు.
కపిలేశ్వరం మండల అధ్యక్షురాలు నామాల పద్మ శ్రీనివాస్ స్వగృహంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ, శాసనసభ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు హాజరుకానున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఇరువురు నేతలు ఆత్మీయంగా సమావేశమై పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై చర్చించనున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా పదాధికారులు, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు, ఏడు నియోజకవర్గాల ఎస్‌ఐఆర్ కన్వీనర్లు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ కోరారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అందించే సందేశాలను స్వీకరించి, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.