పోలీసుల వేధింపులు తాళలేక… ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి
సూర్య, తిమ్మాపూర్ :తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి.. పోలీసుల వేధింపులు తాళలేక స్టేషన్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీకి చెందిన కిన్నెర అజయ్‌తో పాటు మరో ముగ్గురిని వరుస దొంగతనాల కేసులో నాలుగు రోజుల క్రితం ఎల్ఎండీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే, అరెస్ట్ చూపకుండానే తమ కుమారుడిని స్టేషన్‌లో ఉంచి పోలీసులు తీవ్ర చిత్రహింసలకు (థర్డ్ డిగ్రీ) గురిచేశారని బాధితుడు అజయ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు.పోలీసులు ఇస్తున్న అమానుషిక వేధింపులను, థర్డ్ డిగ్రీ టార్చర్‌ను భరించలేకపోయిన అజయ్.. స్టేషన్ భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అజయ్‌ను తక్షణ చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.పోలీసుల వేధింపులే తమ బిడ్డ ప్రాణాల మీదికి తెచ్చాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితుడికి న్యాయం చేయాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు శాఖ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.