ప్రభుత్వాసుపత్రి వద్ద ప్రమాదకరంగా మారిన విద్యుత్ బాక్స్
వెల్దుర్తి: సూర్య మేజర్ న్యూస్ స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి సమీపంలో రహదారి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ జంక్షన్ బాక్స్ ప్రమాదకరంగా మారింది. ఆసుపత్రికి వచ్చే రోగులు, కాలినడకన వెళ్లే బాటసారులు ఈ మార్గం గుండా వెళ్తున్న సమయంలో విద్యుత్ బాక్స్ నుంచి వింత శబ్దాలు రావడం, నిప్పురవ్వలు (స్పార్కింగ్) ఎగిసిపడటం జరుగుతోందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రధాన రహదారికి ఆనుకుని, నిత్యం ప్రజల సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఈ పరిస్థితి ఉండటంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని బాటసారులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, విద్యుత్ బాక్స్‌ను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, ప్రమాదం జరగకముందే తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ ప్రజలు కోరుతున్నారు.