రైతులు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, మేజర్ న్యూస్: అర్నబ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ శివారు గుణదలలోని మధురానగర్ వెనుక ప్రాంతంలో నేలకొరిగిన వరి పంటలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పొలాల్లో నిలిచిన మురుగునీటిని వెంటనే బయటకు తోడేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నేలకొరిగిన వరి పంటను కాపాడుకునేందుకు గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. గింజలు మొలకెత్తకుండా, నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు పొలాల్లో 5 శాతం ఉప్పు నీటి ద్రావణాన్ని పిచికారీ చేయాలని, తెగుళ్లు, శిలీంధ్ర వ్యాధుల నివారణకు టిల్ట్ లేదా హెక్సాకోనాజోల్ వంటి మందులను శాస్త్రవేత్తల సూచనల మేరకు వినియోగించాలని తెలిపారు. నీటిలో పడిపోయిన వరి దుబ్బులను పైకి లేపి నిలబెట్టి కట్టడం ద్వారా గింజల రంగు మారకుండా, మరింత నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చని సూచించారు. ఈ పర్యటనలో గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎ. సుబ్బిరామి రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డా. ఎం. రవికిషోర్, పంటల ఉత్పత్తి విభాగం శాస్త్రవేత్త డా. పి.ఎం. శివప్రసాద్, మొక్కల సంరక్షణ విభాగం శాస్త్రవేత్త డా. ఎన్. రాజశేఖర్, వ్యవసాయ శాఖ సాంకేతిక ఏవో ఎస్. వాణి, గుణదల వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీలత, వి. వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.