పుస్తకమే నిజమైన స్నేహితుడు.. --పఠనమే భవిష్యత్తుకు పునాది--ఎంఈఓ దేవరాజు --భట్టిప్రోలులో ఘనంగా ప్రారంభమైన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలులోని మాటూరు రామారావు శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రంథాలయ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. భట్టిప్రోలు మండల విద్యాశాఖాధికారి ఎన్. దేవరాజు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు గ్రంథాలయ స్థలదాత కుమారులు మాటూరు నాగ మురళీకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేశారు. విశ్రాంత ఉపాధ్యాయులు బొలిశెట్టి శ్రీనివాసరావు ఈ సభకు అధ్యక్షత వహించారు.
గ్రంథాలయం జ్ఞాన భాండాగారం:
ఈ సందర్భంగా ఎంఈఓ దేవరాజు మాట్లాడుతూ గ్రంథాలయం అంటేనే విజ్ఞాన భాండాగారమ న్నారు. పుస్తక పఠనం వల్ల విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మకత, విజ్ఞానం పెరుగుతాయని తెలిపారు.నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లకు అలవాటు పడి పుస్తకాలకు దూరమవుతున్నారని,ఇది సరికాదన్నారు. ప్రతి విద్యార్థి రోజూ కనీసం అరగంటైనా పుస్తక పఠనానికి కేటాయించాలన్నారు. పుస్తకమే మనకు నిజమైన స్నేహితుడు, మంచి మార్గదర్శకుడు అని ఆయన పిలుపునిచ్చారు.గ్రంథాలయాన్ని విద్యార్థులు మాత్రమే కాకుండా గ్రామంలోని యువకులు, పెద్దలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
బాలల దినోత్సవం కూడా....
నేడు నవంబర్ 14న దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నామని ఎంఈఓ తెలిపారు. పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, పిల్లల భవిష్యత్తు కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు.
విద్యార్థులకు పోటీలు:
వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు గ్రంథాలయం ప్రాముఖ్యత, పుస్తక పఠనం వల్ల కలిగే లాభాలపై ఉత్సాహంగా ప్రసంగించారు. విజేతలకు త్వరలో బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో శాఖా గ్రంథాలయ అధికారి కలపాల సుభాష్ చంద్రబోస్, కోట వెంకట సుబ్బారావు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో ప్రతిరోజూ వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రంథాలయాధికారి తెలిపారు.