ప్రశాంతంగా ముగిసిన నామినేషన్లు
ప్రశాంతంగా ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
17 ఎంపీటీసీ స్థానాలకు 97 నామినేషన్ పత్రాలు దాఖలు
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
ఓర్వకల్లు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 97 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు 3, రెండో రోజు 48, మూడో రోజు 46 నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి సతీష్ కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నాగ అనసూయ స్వీకరించారు. చివరి రోజు అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు నామినేషన్ల దాఖలుకు తరలిరావడంతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అయినప్పటికీ అధికారులు సమన్వయంతో వ్యవహరించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేశారు.
మూడో రోజు పార్టీల వారీగా నామినేషన్లు
చివరి రోజు తెలుగుదేశం పార్టీ తరఫున 15, వైఎస్సార్‌సీపీ నుంచి 19, జనసేన నుంచి 4, బీజేపీ నుంచి ఒకటి, సీపీఐ నుంచి 2, బీఎస్పీ నుంచి ఒకటి, ఆర్‌ఎస్‌పీ నుంచి ఒకటి, స్వతంత్ర అభ్యర్థులుగా 3 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. దీంతో మూడో రోజు మొత్తం 46 నామినేషన్ పత్రాలు సమర్పించారు.
మూడు రోజులకు మొత్తం టిడిపికి 39 వైసీపీకి 43 స్వతంత్ర అభ్యర్థులు సిపిఐ బిజెపి జనసేనకు మిగిలిన వారు నామినేషన్ వేశారు
పటిష్ఠ పోలీసు బందోబస్తు
నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు ఎస్‌ఐ సునీల్ కుమార్ పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు.
ఈ ప్రక్రియలో తహసీల్దార్ విద్యాసాగర్, ఈఓఆర్డీ శాంతయ్య, మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఏవో వెంకటరమణయ్య, మండల స్వర్ణ గ్రామ సచివాలయాల అధికారి సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.