ప్రసన్న వెంకటేశ్వర స్వామి పవిత్ర సమర్పణ
అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు జరిగాయి.ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా చేపట్టారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వరకు ఆలయంలోని మూలవర్లకు, ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. సాయంత్రం 6.45 నుండి రాత్రి 9 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, ఆలయ అర్చకులు సూర్యకుమార్ ఆచార్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి