ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో నేడు చంద్ర బాబు భేటీ
న్యూఢిల్లీ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్, పియూష్ గోయల్‌లతో సీఎం కీలక భేటీలు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పారిశ్రామిక సమాఖ్య (CII) ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, అనంతరం ప్రధాని మోదీతో జరిగే భేటీలో ముఖ్యంగా విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు, బీచ్ కారిడార్ అభివృద్ధి, ఎల్‌నినో ప్రభావానికి సంబంధించి కేంద్ర ఆర్థిక సాయం, గోదావరి జలాలు, నదుల అనుసంధానం మరియు రానున్న గోదావరి పుష్కరాలకు కేంద్ర సహకారం కోరనున్నారు. అలాగే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో నిర్వహించే భేటీలో రాష్ట్రంలోని జాతీయ రహదారులు, కొత్త ప్రాజెక్టుల మంజూరు అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.