పోలంపల్లిలో సీజనల్ హాస్టల్ ప్రారంభం విద్యార్థుల విద్యా పురోగతికి ప్రత్యేక వసతి సదుపాయం
వత్సవాయి మేజర్ న్యూస్ :- మండలంలోని పోలంపల్లి గ్రామంలో విద్యార్థుల విద్యా పురోగతికి మరో ముందడుగు పడింది. సమగ్ర శిక్ష, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా వారి ఆధ్వర్యంలో పోలంపల్లి ఎం.పి.పి.ఎస్ పాఠశాలలో సీజనల్ హాస్టల్‌ను ప్రారంభించారు. పాఠశాల వయస్సు గల పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించడమే ఈ సీజనల్ హాస్టల్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సీజనల్ హాస్టల్ నిర్వహణ బాధ్యతలను ఆదర్శ మహిళా మండలికి అప్పగించారు. విద్యార్థులు విద్యకు దూరం కాకుండా వారికి అవసరమైన వసతి, విద్యా సౌకర్యాలు అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. “విద్య మా హక్కు – అందరూ చదవాలి, అందరూ ఎదగాలి” అనే లక్ష్యంతో పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సీపీఎం నాయకులు మండేపూడి చంద్రశేఖర్ రావు, మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దారెళ్లి చిరంజీవి, పాఠశాల చైర్మన్ రాఘవులు, వైస్ చైర్మన్ నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పోలంపల్లి గ్రామంలో ప్రారంభమైన సీజనల్ హాస్టల్‌ను పాఠశాల వయస్సు ఉన్న పిల్లలు సద్వినియోగం చేసుకుని విద్యలో ముందుకు సాగాలని నిర్వాహకులు కోరారు.