పోలిపల్లి జడ్పీ హైస్కూల్‌లో బంగార్రాజు ఆకస్మిక తనిఖీ
భోగాపురం, సూర్య: భోగాపురం మండలం పోలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జ్ కర్రోతు బంగార్రాజు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నీచర్, ఆటస్థలాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు వివరాలు తెలుసుకుని, విద్యా ప్రమాణాల మెరుగుదలకు మరింత కృషి చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శరత్ కుమార్, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులతో సమావేశమై సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎస్‌ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.