andhrapradesh
పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలోని ఇంట్లో సాధారణ నివాసితులు మాత్రమే ఉండాలి
నగరం, మేజర్ న్యూస్:
నగరం మండల పరిధిలోని 27 గ్రామపంచాయతీల్లో గురువారం నిర్వహించనున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ కు నివాస గృహం 100 మీటర్ల పరిధిలో
ఉన్నవారికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని స్థానిక ఎస్సై చెన్నకేశవులు తెలిపారు. పోలింగ్ రోజున ఆ ఇంట్లో సాధారణ నివాసితులు మాత్రమే ఉండాలని, ఎన్నికల ప్రచారం, ఓటర్లను ప్రభావితం చేయడం, బయటి వ్యక్తులను గుమికూడించడం, పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం, అనధికార కార్యకలాపాలకు ఇంటిని ఉపయోగించరాదని హెచ్చరించారు. మండలంలో వంద మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఓటర్ల స్వేచ్ఛకు, ఓటింగ్ గోప్యతకు భంగం కలిగించరాదని, ఇంటి ముందు, గల్లీల్లో, రహదారులపై వాహనాలను పార్కింగ్ చేసి రాకపోకలకు ఆటంకం కలిగించరాదన్నారు .
సెక్టార్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, పోలీస్ మొబైల్స్, అత్యవసర వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు మార్గాలను ఖాళీగా ఉంచాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టరీత్యా చర్యలు గైకొంటామని ఆయన హెచ్చరించారు.