పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ
నెల్లూరు కల్చరల్, రాపూరు, మేజర్ న్యూస్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో వెలసిన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారికి శుక్రవారం ఉదయం అన్నకూటోత్సవం (తిరుప్పావడ సేవ) అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానార్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా విశేష పూజలు, అన్నకూటోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, క్షేత్రంలో ప్రతి శుక్రవారం స్వామివారికి అన్నకూటోత్సవ సేవ నిరంతరం జరుగుతుందని తెలిపారు. ఈ విశేష సేవలో పాల్గొనదలిచిన భక్తులు రూ.500 రుసుము చెల్లించి సేవ టికెట్ పొందవచ్చని పేర్కొన్నారు. సేవలో పాల్గొన్న భక్తుల పేరిట వారి గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి, స్వామివారి శేష తీర్థ ప్రసాదాలతో పాటు ఒక కేజీ పులిహోరను ప్రసాదంగా అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు.