పేదలకు అందని ప్రభుత్వ వైద్యం: మెరుగైన వసతులు కల్పించాలని సిపిఐ డిమాండ్.
కావలి మేజర్ న్యూస్ : కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భరించలేక కావలి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి రోజూ వందలాది మంది రోగులు, గర్భిణులు ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్నారని తెలిపారు. అయితే ఇక్కడ రక్త పరీక్షలు, ఎక్స్-రే, స్కానింగ్ నివేదికలు రావడానికి రెండు రోజులు పడుతుండటంతో వ్యాధి నిర్ధారణ, చికిత్సలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌లో గంటలోనే ఇచ్చే రిపోర్టులు ఇక్కడ ఆలస్యం కావడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గర్భిణులకు, అత్యవసర రోగులకు నిర్లక్ష్యం లేకుండా సకాలంలో వైద్య సేవలు అందించాలి. వైద్య పరీక్షల నివేదికలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రి పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచి, దుర్వాసన రాకుండా శుభ్రం చేయాలి. రోగులకు స్వచ్ఛమైన తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, కూర్చోవడానికి వసతి కల్పించాలి. ఆసుపత్రి సేవలపై నిరంతర పర్యవేక్షణ ఉంచి, సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ కార్యక్రమంలో సిపిఐ కావలి డివిజన్ సహాయ కార్యదర్శి దమ్ము దర్గాబాబు, నాయకులు బిళ్ళా పురుషోత్తం, మండ్ల వెంకటేశ్వర్లు, చేవూరు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.