BREAKING
బంగారం, లోహాల పతనం కొనసాగుతుందా? యూఎస్ కోర్ పీసీఈ ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లపైనే మదుపర్ల దృష్టి! క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు ప్రమాదకరం? చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ మండల కృష్ణ ఈ వారం డివిడెండ్ స్టాక్స్ అలర్ట్... చింతలమానేపల్లి ఎస్సై గా స్వరూప్ రాజ్ గల్ఫ్ గగనతలంలో అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామన్న ఇరాన్ గ్రామ అభివృద్ధి..పేదల సంక్షేమమే ధ్యేయం.. ఆదరించండి.. అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి.. 2024 సెప్టెంబర్ తర్వాత కనిష్ట స్థాయికి పతనమై 2% కోలుకున్న బిట్‌కాయిన్: క్రిప్టో మదుపర్లకు స్వల్ప ఊరట పశుగ్రాస కొరత నివారణ కోసం... హరిత గోపాలం పథకం. ఇరాన్ అణు కార్యక్రమంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన... జిల్లా యువజన ఉత్సవాల్లో సత్తా చాటిన ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు భారత ఐటీ రంగానికి ఏఐ ముప్పుపై ఆందోళనలు అనవసరం: పీపీఎఫ్ఏఎస్ సీఐఓ రాజీవ్ ఠక్కర్! వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి ఎస్‌సీఓ ఫోరమ్ చర్చలు:

పశుగ్రాస కొరత నివారణ కోసం... హరిత గోపాలం పథకం.

Select Suryaa Now
పశుగ్రాస కొరత నివారణ కోసం... హరిత గోపాలం పథకం.

**అనంతపురం:** జిల్లాలో పశుగ్రాస కొరతను నివారించి పశుసంపదను సంరక్షించడంతో పాటు పశుపోషకుల జీవనోపాధికి భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ‘హరిత గోపాలం’ కార్యక్రమాన్ని చేపట్టింది. వీబీ-జీ రామ్ (జీ) పథకం కింద ప్రభుత్వ, గ్రామ పంచాయతీ, సామూహిక భూములతో పాటు ఇతర అర్హత కలిగిన భూముల్లో శాశ్వత పశుగ్రాస పంటల సాగును ప్రోత్సహించనున్నారు. పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖలతో పాటు సెర్ప్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 2026-27 సంవత్సరంలో ఎల్‌నినో ప్రభావం, దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో పచ్చిమేత లభ్యతను పెంచడమే ప్రధాన ఉద్దేశమని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. పశువుల పెంపకంలో మొత్తం ఉత్పత్తి వ్యయంలో సుమారు 65 నుంచి 70 శాతం వరకు మేతకే ఖర్చవుతోంది. నాణ్యమైన పచ్చిమేత అందుబాటులో ఉంటే ఖరీదైన పశుదాణాపై ఆధారపడటం తగ్గుతుంది. పశువులకు సమతుల్య పోషకాహారం అందడంతో పాల ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడంతో పాటు ఆరోగ్యం, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడతాయి. ముఖ్యంగా కరువు పరిస్థితుల్లో పశుగ్రాసం కొరత కారణంగా పశువులను విక్రయించుకోవాల్సిన పరిస్థితులను నివారించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది. నిరంతర నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలు, గ్రామ పంచాయతీ, సామూహిక భూములు, దేవాదాయ శాఖకు చెందిన ఖాళీ స్థలాలు, రైతులు స్వచ్ఛందంగా అందించే భూముల్లో పశుగ్రాస సాగు చేపట్టవచ్చు. అలాగే వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాల పరిధిలోని అనువైన భూములను కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకు ఎలాంటి కౌలు లేదా అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. కనీసం అర ఎకరం నుంచి గరిష్ఠంగా పది ఎకరాల వరకు ఒక యూనిట్‌గా సాగు చేపట్టవచ్చు. పది ఎకరాలకు మించి సామూహిక భూముల్లో సాగు చేయాలంటే జిల్లా కలెక్టర్, జిల్లా కార్యక్రమ సమన్వయకర్త అనుమతి తప్పనిసరి. ఈ పథకం కింద రెండేళ్లపాటు సాగు నిర్వహణకు ఆర్థిక సహాయం అందించనున్నారు. మొదటి ఏడాది భూమి తయారీ, దుక్కి దున్నడం, మొక్కల కొనుగోలు, నాటడం వంటి పనులు చేపడతారు. రెండో ఏడాది పంట నిర్వహణ, నీటి తడులు, ఎరువుల వినియోగం, మేత కోత తదితర పనులు నిర్వహిస్తారు. సూపర్ నేపియర్, హైబ్రిడ్ నేపియర్, సీఓ-3, సీఓ-4 వంటి అధిక దిగుబడి, పోషక విలువలు కలిగిన శాశ్వత పశుగ్రాస రకాలను సాగు చేయనున్నారు. ఆమోదిత సరఫరాదారుల నుంచి రెండు నోడ్లతో కూడిన పశుగ్రాస కాండం ముక్కలను సేకరించి నాటేందుకు సాంకేతిక సహకారం అందిస్తారు. ఒక ఎకరంలో శాశ్వత పశుగ్రాస సాగుకు రెండేళ్లపాటు మొత్తం రూ.69,730 అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఇందులో మొదటి ఏడాది రూ.43,522, రెండో ఏడాది రూ.26,208 ఖర్చుగా అంచనా వేశారు. భూమి తయారీ, బోదెల నిర్మాణం, మొక్కల కొనుగోలు, నాటడం, నీటి తడులు, కలుపు తొలగింపు, ఎరువులు, మేత కోత వంటి పనులకు ఈ నిధులు వినియోగిస్తారు. 2026-27 సంవత్సరానికి రోజువారీ కూలీ రేటు రూ.312 ఆధారంగా అంచనాలు రూపొందించారు. వాస్తవ చెల్లింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటాయి. గ్రామ పంచాయతీ తీర్మానం ఆధారంగా స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని అమలు చేస్తారు. వ్యక్తిగత రైతుల భూముల్లో సాగు చేపట్టినప్పుడు భూమి యజమాని, సంబంధిత సంఘం, పశుసంవర్ధక శాఖ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ మధ్య మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో ఒప్పందం చేసుకోవాలి. ఈ ఒప్పందం ద్వారా సాగు, వినియోగ హక్కులు మాత్రమే కల్పిస్తారు. భూమిపై యాజమాన్య లేదా కౌలు హక్కులు సంక్రమించవు. పథకం అమలులో పశుసంవర్ధక శాఖ భూములు, లబ్ధిదారుల గుర్తింపు, పంటల ఎంపిక, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామసభ తీర్మానాలు, అంచనాలు, కూలీల హాజరు, వేతనాల చెల్లింపులు, రికార్డుల నిర్వహణ చేపడుతుంది. వ్యవసాయ శాఖ సిబ్బంది సాంకేతిక సహకారం అందిస్తారు. పనుల ప్రారంభం, పురోగతి, పూర్తయిన దశల్లో జియో ట్యాగింగ్ ఫొటోలు తీసి భువన్, బ్లూ ఫ్రాగ్ మొబైల్ అనువర్తనాల్లో వివరాలను నమోదు చేస్తారు. సమాచార బోర్డుల ఏర్పాటు, సామాజిక తనిఖీల ద్వారా పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తారు. జిల్లాలో పశుసంపదను కరువు పరిస్థితుల నుంచి రక్షించేందుకు రైతులు, పశుపోషకులు, స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, గ్రామ పంచాయతీలు ముందుకు రావాలని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. నీటి వసతి ఉన్న ఖాళీ భూములను గుర్తించి శాశ్వత పశుగ్రాస సాగును విస్తరించడం ద్వారా భవిష్యత్తులో మేత కొరతను తగ్గించి పశుపోషకులకు ఆర్థిక భరోసా కల్పించవచ్చని తెలిపారు. **పచ్చిమేత సాగు.. పశుసంపదకు రక్షణ.. పశుపోషకులకు జీవన భరోసా!**
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.