పశ్చిమగోదావరి జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు 393 సర్పంచ్ స్థానాలు, 4,206 వార్డులకు కేటాయింపులు..
భీమవరం, సూర్య న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి. నాగరాణి అక్టోబరు 14న గెజిట్ నంబర్ 86/2026ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994, ప్రభుత్వ ఉత్తర్వులు జీఓ ఎంఎస్ నంబర్ 154 ప్రకారం ఈ రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.రెవెన్యూ డివిజనల్ అధికారులు, సబ్ కలెక్టర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు రూపొందించిన జాబితాల ఆధారంగా రిజర్వేషన్లను నిర్ణయించారు. గెజిట్ విడుదలతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలపై రాజకీయ వర్గాలు, ఆశావహుల్లో ఆసక్తి పెరిగింది.సర్పంచ్ స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యంజిల్లాలోని 393 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) 71 స్థానాలు కేటాయించగా, వీటిలో 31 మహిళలకు, 40 జనరల్ కేటగిరీకి కేటాయించారు. వెనుకబడిన తరగతులకు (బీసీ) 120 స్థానాలు కేటాయించగా, 57 మహిళలకు, 63 జనరల్ కేటగిరీకి కేటాయించారు. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 202 స్థానాలకుగాను 104 మహిళలకు, 98 జనరల్ కేటగిరీకి కేటాయించారు. మొత్తం మీద మహిళలకు 192 సర్పంచ్ స్థానాలు కేటాయించినట్లు వివరించారు.జిల్లాలో షెడ్యూల్డ్ ఏరియాలు లేనందున సర్పంచ్ స్థానాల్లో ఎస్టీ కేటగిరీ రిజర్వేషన్లు లేవని పేర్కొన్నారు.4,206 వార్డుల్లో రిజర్వేషన్ల కేటాయింపుజిల్లా వ్యాప్తంగా ఉన్న 4,206 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఎస్టీలకు 5, ఎస్సీలకు 811, బీసీలకు 1,175, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2,215 వార్డులు కేటాయించారు. ఎస్టీ వార్డుల్లో 2 మహిళలకు, 3 జనరల్ కేటగిరీకి; ఎస్సీ వార్డుల్లో 317 మహిళలకు, 494 జనరల్ కేటగిరీకి; బీసీ వార్డుల్లో 575 మహిళలకు, 600 జనరల్ కేటగిరీకి కేటాయించారు. అన్రిజర్వ్డ్ వార్డుల్లో 1,209 మహిళలకు, 1,006 జనరల్ కేటగిరీకి కేటాయించినట్లు గెజిట్లో పేర్కొన్నారు.ప్రధాన మండలాల్లో కీలక రిజర్వేషన్లుపాలకొల్లు మండలం: అగర్రు, లంకలకోడేరు (అన్రిజర్వ్డ్); చందపర్రు (ఎస్సీ మహిళ); చింతపర్రు, దిగమర్రు (బీసీ మహిళ); గోరింటాడ (ఎస్సీ); వల్లూరు, తిళ్లపూడి (అన్రిజర్వ్డ్ మహిళ).తాడేపల్లిగూడెం మండలం: అప్పారావుపేట, ఆరుగొలను, నీలాద్రిపురం (అన్రిజర్వ్డ్ మహిళ); ఆరుళ్ల (ఎస్సీ మహిళ); చినతాడేపల్లి (బీసీ); దండగర్ర (బీసీ మహిళ); నందమూరు, వీరంపాలెం (ఎస్సీ).భీమవరం మండలం: దయ్యాలతిప్ప (బీసీ మహిళ); దిరుసుమర్రు, యానమదుర్రు (అన్రిజర్వ్డ్ మహిళ); జొన్నలగరువు (ఎస్సీ); వెంప (బీసీ); కొమటితిప్ప నార్త్ (ఎస్సీ మహిళ).తణుకు మండలం: దువ్వ, కొమరవరం, వేల్పూరు (అన్రిజర్వ్డ్ మహిళ); కోనాల (ఎస్సీ); మహాలక్ష్మి చెరువు (బీసీ మహిళ); మండపాక, తేతలి (అన్రిజర్వ్డ్); ముద్దాపురం (బీసీ).ఉండి మండలం: ఆరేడు (అన్రిజర్వ్డ్ మహిళ); చిలుకూరు, వెండ్రం, యెండగండి (బీసీ మహిళ); చినపుల్లూరు (ఎస్సీ మహిళ); ఉండి (బీసీ).ఆచంట మండలం: ఆచంట (అన్రిజర్వ్డ్); ఆచంట వేమవరం, కొడమంచిలి (అన్రిజర్వ్డ్ మహిళ); పెదమల్లం (ఎస్సీ మహిళ); పెనుమంచిలి (ఎస్సీ); వల్లూరు (బీసీ మహిళ).ఎన్నికలపై పెరిగిన ఆసక్తిరిజర్వేషన్ల గెజిట్ ప్రతులను తదుపరి చర్యల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్కు పంపించినట్లు అధికారులు తెలిపారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమకు అనుకూలమైన స్థానాలపై దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు మరింత వేడెక్కే అవకాశముంది.
రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా