పరిశుభ్ర నగర నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకం
‘స్వచ్ఛత హి సేవ’లో భాగంగా ‘ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్’ కార్యక్రమం
తడి, పొడి చెత్తను ఇళ్ల వద్దే వేరు చేసి అందించాలి
సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి
విశాఖపట్నం, అక్టోబర్మే 01, మెజర్ న్యూస్ :
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది కేవలం పారిశుధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దగలమని పేర్కొన్నారు.
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమంలో భాగంగా గురువారం సౌత్‌జోన్ పరిధిలోని సెంట్రల్ పార్కులో ‘ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్’ థీమ్‌తో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొచ్చ రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, సౌత్‌జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు పాల్గొన్నారు.
అక్టోబర్ 17 వరకు కొనసాగే ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమంలో భాగంగా నగరవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నగర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఘన వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం, ఇంటింటి చెత్త సేకరణను పటిష్టంగా నిర్వహించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పల్లి నల్లనయ్య మాట్లాడుతూ.. అధికారులు, పారిశుధ్య కార్మికులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఇళ్ల వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. రోడ్లు, కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా జీవీఎంసీ సిబ్బందికే అందించాలని కోరారు. ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి సీజనల్ వ్యాధుల నివారణకు సహకరించాలని సూచించారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొచ్చ రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరాలను నిర్మించగలమని పేర్కొన్నారు. అక్టోబర్ 17 వరకు జరిగే కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.
జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ నగరంలోని మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు తమ ఇళ్ల వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి సిబ్బందికి అందించాలని సూచించారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయడం వల్ల పారిశుధ్య సమస్యలతో పాటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో పరిశుభ్రతను పాటించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇతరులను కూడా స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం సామాజిక బాధ్యతగా స్వీకరిస్తూ ‘స్వచ్ఛ ప్రతిజ్ఞ’ చేయించారు. నగర పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులను సన్మానించి, వారి సేవలను అధికారులు అభినందించారు.
కార్యక్రమంలో ఏపీడీ పద్మావతి, జీవీఎంసీ అధికారులు, పారిశుధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.