ఏపీ ప్రభుత్వ నిర్ణయం
అమరావతి, సూర్య ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు గురువారం రద్దు చేసింది. పంచాయతీరాజ్, పురపాలక శాఖలు జారీ చేసిన జీవో 105, జీవో 1065లు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేస్తూ ధర్మాసనం వీటిని కొట్టివేసింది.
సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి మొత్తం 50 శాతానికి మించకూడదని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రభుత్వం జీవోల ద్వారా ఇచ్చే 34 శాతం బీసీ కోటాతో కలిపి మొత్తం రిజర్వేషన్ల శాతం 50 దాటుతుండటంతో ఈ ఉత్తర్వులను చెల్లుబాటు కాకుండా చేసింది. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియ నిలిపివేతకు నిరాకరించిన కోర్టు, వచ్చే 6 వారాల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) ఆదేశించింది.
అత్యున్నత న్యాయస్థానంలో సవాల్‌కు సిద్ధమైన సర్కార్:
హైకోర్టు తీర్పుపై స్పందించిన ఏపీ ప్రభుత్వం, తమ ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలనే పట్టుదలతో ఉన్న కూటమి ప్రభుత్వం, హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే పలువురు సీనియర్ న్యాయ నిపుణులతో ప్రభుత్వం తీవ్రంగా సంప్రదింపులు జరుపుతోంది.
సుప్రీంకోర్టులో స్టే లభిస్తుందా లేక 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి ప్రభుత్వం కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సి వస్తుందా అనేదానిపై రానున్న రెండు మూడు రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది.