నేతన్నలను సీఎం ఆదుకోరా?
హైదరాబాద్, సూర్య ప్రతినిధి :కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కరువై 35 మంది చేనేత కార్మికులు మరణించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) ఆరోపించారు. సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ మరణించిన నేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేలా ఏమైనా ప్రకటన చేస్తారని భావించామని, కానీ వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆయన విమర్శించారు.
మరణించిన ఒక్కో చేనేత కార్మికుని కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశించామని, కానీ ప్రభుత్వం ఎలాంటి ఊరట అందించలేదని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటన ప్రజాసమస్యల పరిష్కారానికి కాకుండా, ఏదో శత్రుదేశంపై దాడికి వెళ్లినట్లు ఉద్రిక్త వాతావరణంలో సాగిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా చేనేత కార్మికుల సంక్షేమంపై ఏం తేల్చారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను, ప్రజా సమస్యలను తాము నిలదీస్తున్నామనే కక్షతోనే తమపై కోపం ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.