పలాస మండలంలో ప్రశాంతంగా పంచాయతీ పోలింగ్.
73.42 శాతం పోలింగ్ నమోదు.
గరుడఖండి,బ్రాహ్మణతర్లా,చినంచల లో హౌస్ అరెస్ట్ లు.
పలాస, నవంబర్ 26,మేజర్ న్యూస్.
పలాస మండలంలో గురువారం తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.16 పంచాయతీల్లో సర్పంచ్‌లకు,వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు.
73.42 శాతం పోలింగ్.
ఈ ఎన్నికలో మొత్తం 73.42 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలోని 28,823 మంది ఓటర్లు ఉండగా, 20,746 ఓట్లు పోలయ్యాయి. అందులో మహిళలు 11,088, పురుషులు 9,658 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మండలంలో 124 పోలింగ్ కేంద్రాల్లో 36 మంది సర్పంచ్, 184 మంది వార్డు సభ్యుల కు పోలింగ్ నిర్వహించారు.ఉదయం 9 గంటలకు 33.83 శాతం, 11 గంటలకు 64.52 శాతం, పోలింగ్ ముగిసే సరికి 73.42 శాతం నమోదైంది.
ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు.
ఎన్నికల అధికారులు మధ్యాహ్నం ఒంటి గంటతో పోలింగ్ ముగుస్తుందని విస్తృతంగా ప్రచారం చేయడంతో చాలాచోట్ల ఉదయం 6.30 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేసేందుకు లైన్‌లో నిలుచున్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చిన్న చిన్న ఘటనలు.
చినంచల పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లు తరచూ బయటకు వెళ్లి రావడంతో టీడీపీ,నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు స్పందించి పోలింగ్ కేంద్రాల పరిధిలో చుట్టూ ఇనుప రైలింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం కంచరాన భాస్కరరావును హౌస్ అరెస్టు చేశారు.గరుడఖండిలో బొత్స రాజేశ్వరి సర్పంచ్ అభ్యర్థి,భర్త షణ్ముఖరావును పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నం చేశారు. గ్రామస్తులు పోలీసులకు అడ్డు తగిలి ఏ కారణం చేత తరలిస్తున్నారో చెప్పాలని పట్టుబట్టడంతో చివరకు ఆయనను ఇంటి వద్ద హౌస్ అరెస్టు చేశారు.అలాగే బ్రాహ్మణతర్లలో బత్తుల సుభాష్ చంద్రబోస్, టెక్కలిపట్నంలో ఉంగ సాయికృష్ణ ను కాశీబుగ్గ పోలీసులు హౌస్ అరెస్టు చేసారు.