పలాస కోర్టు ఆవరణలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.
రాజ్యాంగ పీఠిక పఠించి ప్రతిజ్ఞ చేసిన న్యాయమూర్తి,న్యాయవాదులు - సమన్యాయమే లక్ష్యమని వెల్లడి.
పలాస, నవంబర్ 26,మేజర్ న్యూస్.
భారత రాజ్యాంగ 77వ దినోత్సవం సందర్భంగా గురువారం పలాస కోర్టు ఆవరణలో వేడుకలు ఘనంగా జరిగాయి. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) యు. మాధురి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలాస బార్ అసోసియేషన్ సీనియర్, జూనియర్ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భారతదేశం యొక్క సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర సార్వభౌమాధికారాన్ని ప్రజలందరికీ సమానంగా అందించే విధంగా, సమన్యాయం అందేలా అందరమూ కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే విలువలను కాపాడటం న్యాయవ్యవస్థ బాధ్యత అని ఈ సందర్భంగా వక్తలు తెలిపారు.1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారని, అందుకే ప్రతి ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, అది దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు.సామాన్యుడికి సైతం న్యాయం అందేలా చూడటమే న్యాయవాదులు, న్యాయమూర్తుల ప్రధాన కర్తవ్యమని, రాజ్యాంగ స్ఫూర్తితోనే తాము పనిచేస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు, సిబ్బంది రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తుచేసుకున్నారు.