పకృతి వ్యవసాయం రైతులకు మేలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరోరాజమహేంద్రవరం అర్నాబ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు తక్షణ చర్యలు చేపట్టాలని, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గురువారం కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో తుపాను ప్రభావిత వరి పొలాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల పరిస్థితి, సాగు వివరాలు, ఎరువుల వినియోగం, కోతకు సిద్ధంగా ఉన్న పంటలను హార్వెస్టర్ల ద్వారా కోసే అవకాశాలపై వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ సాధారణంగా ఎకరాకు ఎంత దిగుబడి వస్తోంది, యూరియా ఎంత మోతాదులో వినియోగిస్తున్నారు, తొలకరి పంటకు, దాళ్వా పంటకు ఎరువుల వాడకంలో ఎలాంటి వ్యత్యాసాలు ఉంటున్నాయని వివరాలు తెలుసుకున్నారు. నేల స్వభావాన్ని బట్టి ఎరువుల వినియోగం మారుతుందని అధికారులు వివరించారు. పంట ఎదుగుదల, నేల స్వభావం, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో ఎరువులు వినియోగించాలని సూచించారు.తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులు ఆందోళన చెందకుండా, పంట పరిస్థితిని బట్టి చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటను సాధ్యమైనంత త్వరగా నష్టాలు తగ్గే విధంగా కోసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, యంత్రాల వినియోగంపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. పంటలను తిరిగి కోలుకునేలా చేయడంతో పాటు మిగిలిన పంటను కాపాడుకునేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు మార్గదర్శనం చేయాలన్నారు.వాతావరణ మార్పులు, తుపానులు, అధిక వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ విధానాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలు నేల సారాన్ని మెరుగుపరచడం, వ్యవసాయంలో బాహ్య ఉత్పాదకాలపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలను అందించగలవని, విపత్తుల సమయంలో పంటల నష్టాలను తగ్గించే దిశగా రైతులకు ఉపయోగపడే పద్ధతులను వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో అనుసరించాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.