రైతులు త్వరగా వరి కోతలు చేపట్టాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన అధిక వర్షాలకు నీట మునిగిన, నేలకొరిగిన వరి పంటలను జిల్లా వ్యవసాయ అధికారి బి. వెంకటేశ్వరరావు గురువారం అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో పరిశీలించారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలించి తుఫాన్ తీవ్రత తగ్గిన అనంతరం పంటను కాపాడుకోవడానికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లాలో వరి పంట ప్రస్తుతం పూత, పాలు పోసుకునే, గింజ గట్టిపడే, కోత దశల్లో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. అధిక వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున, పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపించాలని సూచించారు. ఎంటీయూ 7029, ఎంటీయూ 1318 వంటి రకాలలో అధిక వర్షాల కారణంగా తాలు గింజలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ధాన్యం రంగు మారడంతో పాటు మానిపండు, మాగుడు తెగుళ్లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. స్వర్ణ, సంపద స్వర్ణ వంటి రకాల వరి చేలు వర్షాలకు నేలకొరిగితే పొలాల్లోని నీటిని అంతర్గత కాలువల ద్వారా బయటకు పంపించాలని సూచించారు. సాధ్యమైన చోట పడిపోయిన వరి చేలను పైకి లేపి కట్టుకోవాలని తెలిపారు. నిలబడిన, నేలకొరిగిన పంటల్లో ధాన్యం రంగు మారకుండా, మానిపండు, మాగుడు తెగుళ్ల వ్యాప్తిని నివారించేందుకు ఎకరాకు 200 మిల్లీలీటర్ల ప్రొపికోనజోల్ మందును పిచికారీ చేయాలని సూచించారు. మందుల వినియోగంలో వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు.
ఈ పర్యటనలో అనపర్తి ఏడీఏ డి.వి. కృష్ణ, డీఏఏటీ శాస్త్రవేత్త డా. మానుకొండ శ్రీనివాస్, మారుటేరు శాస్త్రవేత్త డా. ఎస్. దయాకర్, రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు డా. డి. సుధాకర్‌రావు, డా. సి.హెచ్. సునీత, అనపర్తి మండల వ్యవసాయ అధికారి బి. సురేష్‌కుమార్, ఏఈవోలు, వీఏఏలు, రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.