పి.ఎం కిసాన్ 24 వ విడత పి.ఏం. కిసాన్ నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసారం
శివమూర్తి, స్టాఫ్ రిపోర్టర్ తిరుపతి
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 30 వ తేదీన గుజరాత్ లోని బనస్కాంత జిల్లా వేదికగా 24 వ విడత పి.ఏం కిసాన్ నిధులను ప్రతి రైతుకు 2000 రూపాయల చొప్పున, సుమారు 18680 కోట్ల రూపాయలను దేశంలోని సుమారు 9.34 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి జమ చేసి, వ్యవసాయ మౌలిక అభివృద్ది నిధి కింద 521 కార్యక్రమాలను దేశానికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాస్ కృషి విజ్ఞాన కేంద్రం, తిరుపతి వారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులకు చూపించడం జరుగుతుందని ఆ కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త హెడ్ డా.ఎస్.శ్రీనివాసులు తెలియజేస్తున్నారు. తిరుపతి జిల్లాలో సుమారు 21000 మంది రైతులు ఈ పధకం ద్వారా లబ్ది పొందనున్నారు. సుమారు 4.2 కోట్ల రూపాయల పైగా వీరి ఖాతాలలో జమ కానున్నాయి.చిత్తూరు జిల్లాలో సుమారు 8600 మంది రైతులు ఈ పధకం ద్వారా లబ్ది పొందనున్నారు. సుమారు 1.6 కోట్ల రూపాయలు వీరి ఖాతాలలో జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అన్నదాతా సుఖీభవ పధకంలో భాగంగా 5000 రూపాయల చొప్పున 12.2 కోట్ల రూపాయలను కూడా వీరి ఖాతాలలోకి జమ చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో సుమారు 24500 మందికి పైగా రైతులకు లబ్ది చేకూరుతుంది. చిత్తూరు జిల్లాలో అన్నదాతా సుఖీభవ పధకం ద్వారా 5000 రూపాయల చొప్పున 9500 మంది రైతులు లబ్ది పొందనున్నారు. సుమారు 4.9 కోట్ల రూపాయలను వీరి ఖాతాలలోకి జమ చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనే రైతులకు “ఖేత్ బచావో అభియాన్- రబీ” లో భాగంగా రబీ పంటల యాజమాన్యం, నేల నీటి సంరక్షణ, సమతుల ఎరువుల యాజమాన్యం, జీవన ఎరువుల ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయవిధానం గురించి వివరించటం జరుగుతుందని ఆయన తెలిపారు.