పాఠశాలలో మళ్లీ వాయిదా పడ్డ ఎస్ఎంసి ఎన్నికలు
కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి :-
నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఇటీవల నిర్వహించిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో వివిధ కారణాలతో 36 పాఠశాలల్లో ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. వాయిదా పడిన పాఠశాలల్లో శనివారం మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ.. కొన్ని పాఠశాలల్లో అవసరమైన కోరం లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేకపోయారు. మరికొన్ని చోట్ల సభ్యుల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది. మల్లాపురం, అచ్చంపల్లి, బెస్తరపల్లి, కొలిమిపాళెం, నిజవల్లి, ఎనుములదొడ్డి, మహంతపురం తదితర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్యం తదితర అంశాల పర్యవేక్షణలో ఎస్‌ఎంసీలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఎన్నికల ప్రక్రియ వరుసగా వాయిదా పడుతుండటంతో ఆయా పాఠశాలల్లో కమిటీల ఏర్పాటు ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్న తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో వ్యవహరించాలని, వివాదాలకు తావులేకుండా నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యాభిమానులు కోరుతున్నారు. వాయిద పడిన పాఠశాలల్లో త్వరితగతిన ఎన్నికలు నిర్వహించి ఎస్‌ఎంసీ కమిటీలను ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.