పాఠశాల, కళాశాల బస్సుల్లో రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆర్టీఓ రంగనాయకులు
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్ : పాఠశాల, కళాశాల బస్సుల డ్రైవర్లు, సిబ్బంది రహదారి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జి ఆర్టీఓ ఎస్.ఎస్. రంగనాయకులు సూచించారు. మంగళవారం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం పరిధిలో పాఠశాల కళాశాలలు యాజమాన్యాలు, డ్రైవర్లు, సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా రంగనాయకులు మాట్లాడుతూ డ్రైవర్లు విధిగా నైపుణ్య శిక్షణ పొందడంతోపాటు డ్రైవింగ్ లైసెన్సులు, వాహన పత్రాలను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలన్నారు. బస్సు డ్రైవర్లు, సిబ్బందికి యాజమాన్యాలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి, వారు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవాలని సూచించారు. అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవడంతోపాటు విద్యార్థుల భద్రతపై యాజమాన్యాలు, డ్రైవర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎలా స్పందించాలనే అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ చి. సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతి స్కూల్ బస్సులో తప్పనిసరిగా డాష్‌బోర్డ్ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగిన సందర్భంలో ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు కెమెరా దృశ్యాలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి బస్సులో వి ఎల్ టి డి పరికరాన్ని కూడా తప్పనిసరిగా అమర్చుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు కె.డి.వి. రవిగోపాల్, ఫల్గుణి తదితరులు పాల్గొన్నారు.
కె.వి రమణారావు, జంగారెడ్డిగూడెం,ఏలూరు జిల్లా.