ఓటు వేయడంలో వయసు అడ్డంకి కాదు!
మెలియాపుట్టి, సూర్య : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వయసుతో పనిలేదని చాటిచెప్పారు 92 ఏళ్ల రంతి దూదమ్మ. మెలియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన ఆమె గురువారం వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. వయసు మీద పడినా ప్రజాస్వామ్య ప్రక్రియలో తన బాధ్యతను విస్మరించకుండా ఓటు హక్కును వినియోగించుకోవడం పలువురిని ఆకట్టుకుంది. ఆమె పట్టుదలను చూసి స్థానికులు అభినందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకూ ప్రాధాన్యత ఉందని, ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని దూదమ్మ తన ఆచరణతో చాటిచెప్పారు. యువతతో పాటు అన్ని వయసుల వారు ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎన్నికల్లో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు.