పొదలకూరులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల..
పొదలకూరు, మేజర్ న్యూస్ : సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన పొదలకూరులోని బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.జెడ్పీటీసీ, ఎంపీటీసీ బిట్-2 పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోలింగ్ ఏజెంట్ల విషయంలో వివాదం చెలరేగింది. ఇరుపార్టీల అభ్యర్థులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం కాస్తా తోపులాటకు దారితీసింది. దీంతో ఒక్కసారిగా పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టడంతో సుమారు అరగంట తర్వాత పోలింగ్ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది.ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు గురువారం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల సైతం పొదలకూరులో ఎన్నికల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన పొదలకూరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కలెక్టర్ పర్యటనతో పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా చర్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.