ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసుకునేందుకు అవకాశం
ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసుకునేందుకు అవకాశం
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
చదువు మధ్యలో ఆపేసిన వారు, పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఫెయిలైన విద్యార్థులు తిరిగి విద్యను కొనసాగించేందుకు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ మంచి అవకాశాన్ని కల్పిస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్ తెలిపారు. బుధవారం ఓర్వకల్లు ఎంపీడీవో కార్యాలయంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శ్రీధర్ బాబు, ఎంపీడీవో ఎం. నాగ అనసూయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లకు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను పూర్తి చేసుకునే విధానం, ప్రవేశాల ప్రక్రియపై అవగాహన కల్పించారు.
పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించని వారు, పదో తరగతి మధ్యలో చదువు మానేసిన వారు, ఇంటర్మీడియట్ విద్యను మధ్యలో నిలిపివేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30వ తేదీ చివరి గడువు కావడంతో అర్హులైన వారందరూ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు జి. ఓంకార్ యాదవ్, కె. రాంభూపాల్ రెడ్డి, ఏఐ కోఆర్డినేటర్లు పి. రామచంద్రారెడ్డి, నాగన్న, హుస్సేన్ వలి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.