నూతన ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌తో ఎరువుల పంపిణీపై పర్యవేక్షణ వత్సవాయి రైతు సేవా కేంద్రం, సహకార సంఘం, ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
వత్సవాయి, నవంబర్ 19: రైతులకు ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంపొందించడంతో పాటు, అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ విధానాన్ని జిల్లా వ్యవసాయ అధికారి సి.హెచ్. తిరుమలదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గురువారం వత్సవాయి మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణతో కలిసి ఆమె పర్యటించారు. తొలుత రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి ఎరువుల అవసరాలు, పంపిణీ విధానం, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు, పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించారు.అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించి ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులను తనిఖీ చేశారు. ఎరువుల విక్రయాలను ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో సక్రమంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రైవేట్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి డీలర్లు నూతన యాప్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువులను సకాలంలో అందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ నూతన ఎఫ్ఎఫ్ఎస్ విధానం ద్వారా రైతులు తమకు అవసరమైన ఎరువులను స్వయంగా యాప్‌లో బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఈ విధానం వల్ల ఎరువుల విక్రయాలు, పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, నిల్వలు, విక్రయాల వివరాలను డిజిటల్ విధానంలో పర్యవేక్షించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఎరువుల అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టడంతో పాటు అర్హులైన రైతులకు అవసరమైన ఎరువులు అందించేందుకు ఈ విధానం దోహదపడుతుందని వివరించారు.రైతులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, ఎరువుల డీలర్లు నూతన యాప్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణ, ఏఈఓలు, రైతు సేవా కేంద్ర సిబ్బంది, పీఏసీఎస్ సీఈఓ హరికృష్ణ, సిబ్బంది, ఎరువుల డీలర్లు, రైతులు పాల్గొన్నారు.