న్నికల ప్రక్రియలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి
విజయనగరం, సూర్య: నగరపాలక సంస్థకు జరగనున్న ఎన్నికల ప్రక్రియలో బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని ఎన్నికల సిబ్బందికి కమిషనర్ బాలస్వామి సూచించారు. ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల విధులను వివరించారు. నామినేషన్ల స్వీకరణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, నామపత్రాల పరిశీలన, అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు వంటి విషయాలను విశదపరిచారు. నామినేషన్ల స్వీకరణ నుండి ఓట్ల లెక్కింపు వరకు అన్ని ప్రక్రియలను సమర్ధవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని అన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీలలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పుడు ఎన్నికల నిబంధనల ప్రకారం వివరాలు అక్కడే పరిశీలించాలని చెప్పారు. అభ్యర్థుల కుల దృవీకరణ పత్రం తప్పనిసరి అని చెప్పారు. అలాగే ఖర్చుల వివరాలు వెల్లడిస్తామని స్వీయ దృవీకరణ పత్రాన్ని అభ్యర్థి అందించాల్సి ఉంటుందని చెప్పారు. అందరి సమన్వయంతో ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లను నగరపాలక సంస్థ సిబ్బంది పూర్తి చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయం మొదటి,రెండవ అంతస్తులలో ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 4 వార్డులకు ఒక కౌంటర్ చొప్పున 16 కౌంటర్లలో నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.