పలాస, ఇచ్ఛాపురం మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ఫేజ్–1 శిక్షణ సమావేశం
శ్రీకాకుళం, సూర్య : ఎన్నికల విధులు నిర్వహణలో లోపాలు జరగరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారి,స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎలక్షన్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లలో భాగంగా, జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారి,స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన కలెక్టర్ సమావేశ మందిరంలో కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులు (ROలు), తహసీల్దార్లతో ఫేజ్–1 ఎన్నికల నిర్వహణపై శిక్షణ సమావేశం వీడియో ప్రదర్శన ద్వారా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో సంబంధిత అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఫేజ్ -1 ఎన్నికల షెడ్యూల్, అక్టోబర్ 18 నామినేషన్ స్వీకరణ, అక్టోబర్ 19 తేదీన పరిశీలించి అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 21తేదిన నామినేషన్ తిరస్కరించబడుతుందని, సంబంధిత అధికారులు విధులు, బాధ్యతలు, ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన నియమ నిబంధనలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, ఫారం -B, ఫారం-7 పరిశీలనలో పొలిటికల్ పార్టీ కేటగిరీ వారీగా పరిశీలించి, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. చెక్ లిస్టు పరిశీలన తప్పని సరి అని, తిరస్కరించబడిన నామినేషన్లు సంబంధించి అభ్యర్థి యొక్క సంతకంతో డిక్లరేషన్ తీసుకోని జవాబుదారీగా ఉండాలని అధికారులును ఆదేశించారు.
ఈ శిక్షణ సమావేశంలో పలాస, ఇచ్ఛాపురం మునిసిపల్ కమిషనర్లు, శ్రీనివాసరావు, రమేష్, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు,సమగ్ర శిక్ష, ఎ.పి.సి , వేణుగోపాలరావు రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.