నేనేం చేయలేను..! అది అధిష్టానం నిర్ణయం..
విజయనగరం బ్యూరో, సూర్య : "నేనేం చేయలేను..ఇది అధిష్టానం నిర్ణయం..!! మేయర్ అభ్యర్థిత్వంపై..తెగేసి చెప్పేసిన ఎమ్మెల్యే, అసంతృప్తిలో రగిలిపోతున్న ఆశావాహ తమ్ముళ్లు అంటూ నగరం టీడీపీలో రాజకీయ దుమారం రేగింది..!"
విజయనగరం మేయర్ స్థానం జనరల్ మహిళకు కేటాయించబడడంతో కూటమిలోని తెలుగు దేశం పార్టీలో బీసీ ఆశావాహులకు శారాఘతంగా మారింది. గతం మాదిరి బీసీ మహిళకు రిజర్వ్ చేయబడి ఉంటే తమకంటే తమకు టికెట్ దక్కుతుందని టీడీపీ బీసీ నాయకులు కొందరు ఆశ పడ్డారు. అయితే మేయర్ స్థానం జనరల్ మహిళ కావడంతో, అటు ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి ఓసీ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అభ్యర్థిత్వం దాదాపుగా ఖాయమైపోయింది. దీంతో టీడీపీలో ఈక్వేషన్స్ మొదలయ్యాయి. ఎమ్మెల్యే అభిప్రాయం మేరకు మేయర్ టికెట్ దాదాపుగా ఖరారు అవుతుందని ఆశపడ్డ టీడీపీ ఆశావాహులు అంతా ఎవరికున్న స్థాయిలో వారు ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే కూడా చివరి వరకు తన అనుయాయులకే మేయర్ సీటు ఇవ్వాలని గట్టి ప్రయత్నమే చేశారు. ఐతే కోలగట్ల వంటి బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టడం అంత ఆషామాషీ కాదన్న విశ్లేషణకు వచ్చిన టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే సూచించిన పేర్లను పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే వైసీపీ ను వీడి టీడీపీలో చేరి, కీలకమైన, బలమైన నాయకుడిగా ఉన్న చిన్నశ్రీను కుమార్తె సిరి సహస్రను మేయర్ అభ్యర్థినిగా నిలిపెందుకు నిర్ణయం తీసుకుందన్న సమాచారం తమ్ముళ్ళకి తెలిసింది. దీంతో గురువారం ఉదయం నుంచి టీడీపీ బంగ్లాలో రాజకీయ దుమారం చెలరేగింది. మేయర్ సీటు ఆశవాహ తమ్ముళ్లు మీడియా ఎదుట తమ అసంతృప్తిని వెళ్ళగక్కాలన్న ఉద్దేశ్యంతో గురువారం ఉదయం బంగ్లాలో మీడియా సమావేశం అంటూ కబురంపారు. అయితే అటు తర్వాత ఎం జరిగిందో తెలియదు గానీ, మీడియా సమావేశం రద్దు చేసినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ అసంతృప్తుల అంశం రాజకీయం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎన్నికల సమయం తక్కువగా ఉండడంతో ఒక వైపు అన్ని రాజకీయ పార్టీలు భవిష్యత్తు కార్యాచరణతో వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇంకో వైపు వైసీపీ తమ పోటీలో నిలిచే కార్పొరేటర్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ తన ఫ్యాన్ స్పీడ్ పెంచింది. కానీ మేయర్ అభ్యర్థి ఎవరు, కార్పొరేట్ అభ్యర్థులు ఎవరు అనేది ఇప్పటి వరకు ప్రకటన చేయకుండానే టీడీపీ, జనసేన, బీజేపీ లు తమ పార్టీ అభ్యర్థుల్లో ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మేయర్ అభ్యర్దిత్వంపై ఎలాంటి ప్రకటన వచ్చినా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తమ్ముళ్ళ నుంచి ఎమ్మెల్యే సమ్మతి పత్రాలు తీసుకున్నట్టు సర్వత్రా గుస గుసలు వినిపిస్తున్నాయి. అసలు ఈ పత్రాలు ఎందుకు పనికొస్తాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. స్థానిక ఎన్నికల రాజకీయం ప్రతిపక్ష పార్టీలతో కాకుండా తెలుగు తమ్ముళ్ళ మధ్యే పోరు అయ్యేట్టుగా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు టీడీపీ మేయర్ సీటు మజ్జి సిరి సహస్రకే కేటాయించారని అంచనా, విశ్లేషణ ప్రచారం తప్ప అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. ఇంకో వైపు మేయర్ సీటుపై చిన్నశ్రీను ఆసక్తిగా లేనప్పటికీ, టీడీపీ అధిష్టానం నిర్ణయానికి బద్ధుడు కాకతప్పదు. అందులో భాగంగానే తన కుమార్తె సిరి సహస్రకు మేయర్ సీట్ ఖాయమన్న ప్రచారం చిన్నశ్రీను అభిమానుల నుంచి వ్యక్తమౌతోంది. అయితే అభ్యర్థుల ప్రకటన కూడా అధిస్థానం దూతలుగా జిల్లా ఇంజార్జీ మంత్రి, జిల్లా ఎన్నికల ఇంజార్జీ వచ్చి అధికారికంగా ప్రకటన చేస్తారని కబురు రావడంతో తమ్ముళ్లు నిరాశతో వెనుదిరిగారు. శుక్రవారం నుంచి నామినేష్ల ప్రక్రియ ప్రారంభం కావడం, మరో వైపు కూటమి పొత్తు లో తమ భవితవ్యం ఏంటోనన్న ఆందోళన అంతా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా స్థానిక సమరం బంగ్లాలో వేడెక్కుతోంది.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.