నెల్లూరు జిల్లాలో 60 వేలకుపైగా రైతు కుటుంబాల సమస్యలు పరిష్కరించాలి
సీజేఎఫ్‌ఎస్ భూములకు పట్టాలు మంజూరు చేయాలని రైతు ప్రతినిధుల విజ్ఞప్తి
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 60,505 రైతు కుటుంబాలకు చెందిన 66,276 ఎకరాల సీజేఎఫ్‌ఎస్ భూములకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించి, అర్హులైన రైతులకు పట్టాలు మంజూరు చేయాలని రైతు ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. సీజేఎఫ్‌ఎస్ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 288, తేదీ 01-06-2018లోని నిబంధనలను అమలు చేసి, వాటి పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా ఆయా భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతు కుటుంబాలు తమ భూములపై హక్కుల కోసం ఎదురుచూస్తున్నాయని రైతు ప్రతినిధులు తెలిపారు. అర్హులైన రైతులకు భూములపై పూర్తి హక్కులు కల్పించే విధంగా పట్టాలు మంజూరు చేస్తే వేలాది కుటుంబాలకు శాశ్వత భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. రైతుల జీవనోపాధికి కీలకమైన ఈ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత అధికారులతో సమీక్షించి పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు. సీజేఎఫ్‌ఎస్ భూములకు పట్టాల మంజూరు ద్వారా రైతు కుటుంబాలకు భద్రత, హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.