నేడు సతివాడ మోడల్ స్కూల్‌లో ఎస్ఎంసి ఎన్నిక * టీడీపీ వర్సెస్ జనసేన * చైర్మన్ పదవి దక్కేది ఎవరికి?
నెల్లిమర్ల, అక్టోబర్ 2 మేజర్ న్యూస్
మండలంలోని సతివాడ ఆదర్శ పాఠశాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు స్థానిక రాజకీయాల్లో రగడ సృష్టిస్తున్నాయి. గత నెల 29న కోరం లేక వాయిదా పడిన ఈ ఎన్నికలు నేడు అత్యంత ఉత్కంఠభరితంగా జరగనున్నాయి. అయితే, విద్యాసంస్థలను ప్రశాంతంగా ఉంచాల్సిన చోట ప్రధాన రాజకీయ పార్టీల జోక్యం, ముఖ్యంగా టీడీపీ వర్సెస్ జనసేన మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్‌గా మారింది.
చైర్మన్ పీఠంపై పట్టుకోసం నువ్వా-నేనా?
సతివాడ మోడల్ పాఠశాల మండలంలోనే అతిపెద్ద విద్యాసంస్థ కావడంతో, ఇక్కడ ఎస్ఎంసి చైర్మన్ పదవిని దక్కించుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది.
మొత్తం 20 ఎస్ఎంసి సభ్యులకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
మెజారిటీ సాధించాలంటే 11 సీట్లు గెలుపొందాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన హోరాహోరీగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల నాయకులు తల్లిదండ్రుల ఓటర్ల జాబితాలతో ఇంటింటి ప్రచారాలు, క్యాంపెయిన్‌లు నిర్వహించారు.
సయోధ్య కుదరక.. రగిలిన కూటమి రాజకీయం
కూటమిగా కలిసి పనిచేయాల్సిన చోట, స్థానిక స్థాయిలో టీడీపీ, జనసేన మధ్య సయోధ్య కుదరకపోవడం గమనార్హం. గత నెల 29న మండలంతో పాటు, నెల్లిమర్ల నగరపంచాయతీలో పలు పాఠశాలల్లో ఎస్ఎంసి ఎన్నికలు ముగియగా, అక్కడ గెలుపొందిన ఛైర్మన్లు, వైస్ చైర్మన్లను ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా సత్కరించడం విశేషం.
టీడీపీ సత్కరించిన వారినే, జనసేన నాయకులు కూడా వెంటనే వెళ్లి సత్కరించి తమ ఖాతాలో వేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
ఈ పరిణామాలు చూస్తుంటే, మండలంలో ఎస్ఎంసి ఎన్నికలు కేవలం పాఠశాల అభివృద్ధికి పరిమితం కాకుండా, కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపాయని స్పష్టమవుతోంది.
తెరవెనుక సర్దుబాట్లు..
జనసేనకు భంగపాటేనా?
సతివాడ పాఠశాలలో మాత్రం రాజకీయ సమీకరణాలు మరోలా మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ టీడీపీ, వైస్సార్సీపీ వర్గాల మధ్య సభ్యుల సీట్ల కేటాయింపు విషయంలో అంతర్గత సర్దుబాటు కుదిరినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే, క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమిస్తున్న జనసేన పార్టీకి భంగపాటు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భవిష్యత్ రాజకీయాలపై ఎస్ఎంసి ఎఫెక్ట్
చిన్నపాటి స్కూల్ కమిటీ ఎన్నికలకే కూటమి పార్టీలు ఉప్పు-నిప్పులా మారుతుంటే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల ద్వారా నాయకులు తెరవెనుక చీకటి దెబ్బలు వేసుకోవడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
విద్యాసంస్థల్లో రాజకీయ రంగుపై విస్మయం
పిల్లలకు విజ్ఞానాన్ని అందించే పవిత్రమైన విద్యాసంస్థలలోకి ఈ విధంగా రాజకీయాలను చొప్పించడంపై విద్యావేత్తలు, మేధావులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దాల్సిన బడులను రాజకీయ కక్షలకు వేదికగా మలచడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
నేడు జరగనున్న సతివాడ మోడల్ స్కూల్ ఎస్ఎంసి ఎన్నికల్లో ఏ పార్టీ పైచేయి సాధిస్తుంది? టీడీపీ - జనసేన పోరు ఏ మలుపు తిరుగుతుంది? అన్నది ఉత్కంఠగా మారింది.