నౌపడలో ప్రచార హోరు.. సర్పంచ్ పీఠంపై ఎవరికి పట్టు
∆. రాజశేఖర్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ శ్రేణుల ప్రచారం
∆. పద్మలతాదేవి తరఫున టీడీపీ నేతల ముమ్మర ప్రచారం
సంతబొమ్మాళి, నవంబర్ 26, మేజర్ న్యూస్ :
నౌపడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థుల తరఫున నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ మద్దతుదారుడైన పీరుపల్లి రాజశేఖర్ ప్రచారానికి మంచి ప్రాధాన్యత లభిస్తోంది.
ఒకవైపు పీరుపల్లి రాజశేఖర్ నౌపడ, మూడు రోడ్ల జంక్షన్, జగనన్న కాలనీ, పాలవానిపేట, కోటవానిపేట, జగన్నాథపురం ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు మద్దతుగా వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటున్నారు. గతంలో పీరుపల్లి కుటుంబం నుంచి రాజశేఖర్ భార్య కృష్ణవేణి రెండుసార్లు సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఆ కుటుంబానికి గ్రామ పాలనపై ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకసారి ఏకగ్రీవంగా, మరోసారి ఎన్నికల్లో విజయం సాధించి సర్పంచ్‌గా సేవలందించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈసారి కూడా రాజశేఖర్‌కు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరుతున్నారు. ఆయనను గెలిపిస్తే పంచాయతీని మరింత అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం ఉంటుందని ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు.
మరోవైపు టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న సుగ్గు పద్మలతాదేవి తరఫున ఆమె తనయుడు, సంతబొమ్మాళి ఎంపీపీ సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పద్మలతాదేవికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
ఇలా నౌపడ పంచాయతీలో ఇరువర్గాల ప్రచారంతో ఎన్నికల సందడి నెలకొంది. ఒకవైపు గత పాలనా అనుభవాన్ని, కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని ముందుకు తెస్తూ రాజశేఖర్‌కు మరో అవకాశం ఇవ్వాలని వైసీపీ శ్రేణులు కోరుతుండగా, మరోవైపు పద్మలతాదేవి విజయమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ హోరాహోరీ పోరులో నౌపడ పంచాయతీ సర్పంచ్ పీఠం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే!