నకిలీ ఐడీ కార్డులతో ‘ఉక్కు’లో చోరీలు
రౌడీషీటర్ సహా ఏడుగురు సభ్యుల ముఠా అరెస్టు.. 300 కిలోల కాపర్ కేబుళ్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం
గాజువాక, సెప్టెంబర్ 23, మేజర్ న్యూస్ : విశాఖ ఉక్కు కర్మాగారంలోకి నకిలీ గుర్తింపు కార్డులతో చొరబడి రాగి కేబుళ్ల చోరీకి పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ఘరానా ముఠా గుట్టును క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 300 కిలోల కాపర్ కేబుళ్లు, 5 నకిలీ ఐడీ కార్డులు, 5 ఖాళీ కార్డులు, 2 రబ్బరు స్టాంపులతో పాటు చోరీకి వినియోగించిన రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీ ఎ.వెంకట్రావు ఈ వివరాలను వెల్లడించారు.
కంచరపాలెంకు చెందిన రౌడీషీటర్ పైడిపాటి వెంకట భార్గవ్ రాఘవ్ అలియాస్ (బన్నీ), అడవివరంకు చెందిన ఆటో డ్రైవర్ పోతిన శ్రీకాంత్‌లు సులభంగా డబ్బు సంపాదించేందుకు రైల్వే ఉద్యోగుల పేర్లు, ఫొటోలతో నకిలీ ఐడీ కార్డులు, రబ్బరు స్టాంపులు తయారు చేసుకున్నారు. ఈ నెల 18న రాత్రి వై-జంక్షన్ వద్ద కలిసిన నిందితులు బీసీ గేట్ సమీపంలోని వాచ్ టవర్ వద్దకు చేరుకున్నారు. కొందరు రైల్వే గేటు వద్ద నకిలీ కార్డులు చూపి, మరికొందరు గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆర్ఎంహెచ్‌పీ యార్డులో 15 కేబుల్ బండిళ్లను గుర్తించి గోడ దాటించేందుకు యత్నిస్తుండగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది నిఘా వేసి ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, క్రైమ్స్ డీసీపీ పి. లతా మాధురి, అదనపు డీసీపీ ఎన్. రమ్యల ఆదేశాల మేరకు గాజువాక క్రైమ్ సీఐ జి.డి. బాబు నేతృత్వంలోని ప్రత్యేక బృందం సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ప్రధాన నిందితుడు బన్నీపై ఇప్పటికే 8 కేసులు ఉన్నాయని, యువకులకు డబ్బులు, మద్యం ఎరవేసి చోరీలకు వాడుకుంటున్నట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితులతో పాటు ఇనకలపల్లి నాగేంద్ర వర్మ, గిర్రియూ రవి శంకర్, జీవీఎంసీ డ్రైవర్ బంగారు సతీష్ కుమార్, పెయింటర్ ఇనకలపల్లి వంశి, నవాబు యువరాజులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా కేసును ఛేదించిన సీఐ జి.డి. బాబు, ఎస్సై సాంబశివరావు, పోలీస్ సిబ్బందితో పాటు సీఐఎస్‌ఎఫ్ అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.