అనంతగిరి ఘాట్ రోడ్ లో విరిగిపడ్డ కొండ చెరియలు
*భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం.
*పొంగి ప్రవహిస్తున్న వాగులు
*అవస్థలు పడుతున్న గిరిజనులు.
అనంతగిరి, సెప్టెంబర్ 23 మేజర్ న్యూస్ :
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో అనంతగిరి మండలంలో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. ఎడతెరిపిలేని వర్షం వల్ల మండలంలోని గోస్తని చంపావతి వంటి నదులు పొంగి ప్రవహిస్తుండడంతో పాటు గ్రామాల్లోని వాగులు గెడ్డలు,పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో గెడ్డ ఆవల గ్రామాల గిరిజనులు నిత్య అవసరాల కోసం ప్రధాన కేంద్రాలకు వచ్చేందుకు నానఅవస్థలు పడుతున్నారు. మండలంలోని డముకు వారపు సంతకు బుధవారం వచ్చే గిరిజనులు గెడ్డ పొంగి ప్రవహిస్తున్న ఉండడంతో ఒనుకొండ గ్రామానికి చెందిన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 6 గెడ్డలను దాటి వెళ్లాల్సిన ఒనుకొండ గ్రామస్తులు తమ బిడ్డలను సైతం భుజాన మూసుకుంటూ గెడ్డలు దాటుకుంటూ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారపు సంతకు వచ్చి తిరిగి వెళ్లారు. ఓ తండ్రి తన బిడ్డను ఎత్తుకొని వెళ్లడం బాహుబలి సినిమాలో శివగామి దృశ్యాన్ని తలపించింది. వనుకొండ గ్రామానికి వంతెనలు మంజూరు చేయాలని ఎన్నో ఏళ్లుగా స్థానిక గిరిజనులు పోరాటాలు చేస్తున్న ఫలించకపోవడంతో ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా గ్రామ గిరిజనులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా అనంతగిరి ఘాట్ రోడ్ లో వర్షాలకు పలుచోట్ల కొండ చెరియలు జారీ రహదారి పైకి వచ్చాయి. తైడా సమీపంలో జారిపడ్డ కొండ చెరియలను అనంతగిరి ఎస్సై శంకర్ రావు నేతృత్వంలో త్వరితగతిన తొలగించి వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అనంతగిరి తాసిల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామని అదే విధంగా సచివాలయాలలో సిబ్బంది అందుబాటులో ఉండి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహకారంగా ఉండాలని తహసిల్దార్ వీరభద్రాచారి, ఎంపీడీవో ప్రభాకర్ రావులు ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని వారు సూచిస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేశామని వారు తెలిపారు.