శశి థరూర్–మధుయాష్కీ గౌడ్ భేటీ ఎఐపిసి విస్తరణకు కార్యాచరణ రూపకల్పన
తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఎఐపిసి) వ్యవస్థాపక ఛైర్మన్, మాజీ కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ శశి థరూర్‌ను ఎఐపిసి ప్రస్తుత ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగాఎఐపిసి కార్యకలాపాల విస్తరణ, సంస్థ భవిష్యత్ కార్యాచరణ, దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్స్‌ను మరింతగా అనుసంధానం చేసే అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. వివిధ వృత్తి రంగాల్లో పనిచేస్తున్న నిపుణులను కాంగ్రెస్‌తో మరింతగా అనుసంధానం చేయడం, వారి నైపుణ్యం, అనుభవాలను ప్రజా విధానాల రూపకల్పనలో వినియోగించుకునేలా ఎఐపిసి కార్యకలాపాలను విస్తరించడంపై అభిప్రాయాలను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఎఐపిసి ను మరింత బలోపేతం చేయడంతో పాటు, వైద్య, న్యాయ, విద్య, ఐటీ, పారిశ్రామిక, ఆర్థిక తదితర రంగాలకు చెందిన నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై శశి థరూర్, మధుయాష్కీ గౌడ్ చర్చించారు. ప్రొఫెషనల్స్‌ను ఒక వేదికపైకి తీసుకువచ్చి, వారి ప్రతిభను సామాజిక, ఆర్థిక, ప్రజా విధాన అంశాల్లో మరింతగా వినియోగించుకునేలా ఎఐపిసి కార్యక్రమాలను విస్తృతం చేయాల్సిన అవసరంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిపారు.