నానమ్మను హతమార్చిన మనుమడు
ఓర్వకల్లు మేజర్ న్యూస్:నానమ్మను మనుమడు హతమార్చిన దారుణ ఘటన ఓర్వకల్లు మండల పరిధిలోని కాల్వ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఆఫీజ్ బీ (90) అనే వృద్ధురాలిని ఆమె మనుమడు మహబూబ్ బాషా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి గొంతుపై మనుమడు పదునైన కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న మనుమడు కొత్త ఫోన్ కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మనుమడి మానసిక పరిస్థితి సరిగా లేదని గ్రామస్తులు తెలిపినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఘటనకు గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.