మున్సిపల్ ఓట్ల ఎక్కింపు నకు పటిష్ట భద్రత.
కళ్యాణదుర్గం: జిల్లాలో మంగళవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. అనంతపురంతో పాటు తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని, అవసరమైన చోట డ్రోన్లను వినియోగించి అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించాలని ఎస్పీ పి.జగదీశ్ అధికారులకు, పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు, అనుమతి పత్రాలు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని, ప్రవేశించే ప్రతి ఒక్కరినీ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్‌హెల్డ్ డిటెక్టర్లతో తనిఖీ చేయాలని సూచించారు. బ్యాగులు, ఇతర వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించి ఆయుధాలు, పదునైన వస్తువులు, నిషేధిత సామగ్రిని లోపలికి అనుమతించరాదన్నారు. సెల్‌ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, రిటర్నింగ్ అధికారి ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్ల మధ్య వివాదాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, కేంద్రాల పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి అనవసర వ్యక్తుల రాకపోకలను నియంత్రించాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, రిజర్వు బలగాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలన్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవాల పేరుతో ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చేయడం వంటి చర్యలపై అమల్లో ఉన్న ఆంక్షలను ఉల్లంఘించరాదని హెచ్చరించారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను రెచ్చగొట్టడం, కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, గొడవలు సృష్టించడం వంటి వాటిని సహించేది లేదన్నారు. ఆయా మున్సిపల్ పట్టణాల్లో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 అమల్లో ఉంటాయని, సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గెలుపోటములను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించి, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.