లిండ్సే క్లాన్సీ కేసులో రీట్రయల్ దిశగా ప్రాసిక్యూటర్ల అడుగులు: ముగ్గురు పిల్లల హత్య కేసులో తాజా పరిణామాలు
సూర్య అంతర్జాతీయ డెస్క్: తన ముగ్గురు కన్నబిడ్డలను గొంతునులిమి చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మహిళ లిండ్సే క్లాన్సీని రెండోసారి న్యాయ విచారణకు (రీట్రయల్) తీసుకురావాలని ప్రాసిక్యూటర్లు నిర్ణయించారు. మసాచుసెట్స్ ప్లైమౌత్ సుపీరియర్ కోర్టులో జరిగిన తాజా విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ వర్గాలు ఈ మేరకు సంకేతాలిచ్చాయి. మొదటి విచారణ సమయంలో జ్యూరీ సభ్యులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో (హంగ్ జ్యూరీ) న్యాయమూర్తి మిస్ ట్రయల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టివేయాలని డిఫెన్స్ లాయర్లు కోరుతుండగా, ప్రాసిక్యూటర్లు మాత్రం న్యాయం జరిగే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తూ రీట్రయల్ కోసం పట్టుబడుతున్నారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన జెన్నిఫర్ స్ప్రాగ్ మాట్లాడుతూ, క్లాన్సీపై తాము మరోసారి విచారణ చేపట్టేందుకే మొగ్గు చూపుతున్నామని, అయితే ఆమెపై మోపనున్న తుది అభియోగాల వివరాలను ఇంకా ఖరారు చేయలేదని న్యాయస్థానానికి తెలిపారు. మొదటి విచారణలో మొదటి డిగ్రీ హత్య అభియోగాలు నమోదు చేయగా, ఒకవేళ ఇప్పుడు రెండో డిగ్రీ హత్య అభియోగాలుగా మారిస్తే జ్యూరీ బదులు జడ్జి బెంచ్ మాత్రమే తుది తీర్పు ఇచ్చే అవకాశాన్ని నిందితురాలు ఎంచుకోవచ్చు. మరోవైపు కేసును మరింత జాప్యం చేయకుండా త్వరగా స్పష్టత ఇవ్వాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి విచారణ పూర్తి చేయాలని డిఫెన్స్ తరఫు న్యాయవాది కెవిన్ రెడ్డింగ్టన్ డిమాండ్ చేశారు.
డక్స్ బరీలోని తమ నివాసంలో జనవరి 2023లో లిండ్సే క్లాన్సీ తన ఐదేళ్ల కూతురు కోరా, మూడేళ్ల కుమారుడు డాసన్, ఎనిమిది నెలల పసికందు కల్లాన్‌లను దారుణంగా హతమార్చింది. ప్రసవానంతర మానసిక రుగ్మత (పోస్ట్‌పార్టమ్ సైకోసిస్), ఓవర్ మెడికేషన్ కారణంగానే ఆమె ఈ చర్యకు పాల్పడిందని డిఫెన్స్ వాదిస్తుండగా, ఆమెకు ఆలోచనా పరిజ్ఞానం ఉందని, పథకం ప్రకారమే నేరానికి పాల్పడిందని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. మొదటి విచారణలో 11 మంది జ్యూరీ సభ్యులు మానసిక స్థితి ఆధారంగా ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చేందుకు సిద్ధపడగా, ఒక్క సభ్యుడు వ్యతిరేకించడంతో కేసు ప్రతిష్టంభనగా మారి మిస్ ట్రయల్ అయ్యింది.
మరో విచారణ చేపట్టడం రాజ్యాంగబద్ధమైన ‘డబుల్ జియోపార్టీ’ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని డిఫెన్స్ వాదిస్తున్నప్పటికీ, ప్రాసిక్యూటర్లు రీట్రయల్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనిపై న్యాయమూర్తి విలియం సుల్లివన్ తదుపరి నిర్ణయం వెల్లడించనున్నారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసేందుకు కోర్టు వచ్చే ఏడాది మార్చి నెలను ప్రాథమిక గడువుగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయంగా వైద్య, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసు తదుపరి పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.