మండపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం మండపేట పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ టీవీ రంగారావు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్, మార్గదర్శకాలకు అనుగుణంగా అక్టోబరు 28 నుంచి 31వ తేదీ వరకు మండపేట పురపాలక సంఘ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించనున్నట్లు మంగళవారం ఆయన వెల్లడించారు.మండపేట మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 36 వార్డులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సదుపాయానికి అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం నియమించిన ఎన్నికల అధికారులు, సిబ్బంది ప్రత్యేక విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి అర్హుడైన ఓటరు తన ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయానికి అర్హత కలిగిన ఓటర్లు నిర్ణీత తేదీల్లో మండపేట పురపాలక సంఘ కార్యాలయానికి హాజరై, ఎన్నికల అధికారులు సూచించిన విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఓటింగ్ ప్రక్రియలో ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు విజ్ఞప్తి చేశారు.