మేయర్ పదవికి అన్ని అర్హతలు ఉన్న పెద్ది శెట్టి ఉషాశ్రీ
సీతమ్మధార, సూర్య : గ్రేటర్ విశాఖపట్నంలో ఈ పేరు తెలియని ఉండరు. విశాఖ నగరంతో అనుబంధం, జివిఎంసి పాలనలో అనుభవం, అంతర్జాతీయ క్రీడారంగంలో గుర్తింపు, అన్నింటికీ మించి ఉన్నత విద్యావంతురాలు. అంతేకాకుండా కార్పొరేటర్ వంటి ప్రజాప్రతినిధిగా ఎటువంటి అవినీతికి చోటు ఇవ్వకుండా నిజమైన ప్రజా ప్రతినిధిగా గుర్తింపు. కార్పొరేటర్ గా ప్రణాళికాబద్ధంగా పనిచేసి 43వ వార్డును అన్ని విధాల అభివృద్ధి బాటలో నడిపించి శభాష్ అనిపించుకున్నారు. కేవలం తన వార్డు అభివృద్ధి గురించి మాత్రమే కాకుండా నగర ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, మునిసిపల్ సేవలు,రహదారులు, పారిశుధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న యువ నాయకురాలు ఉషాశ్రీ. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 'మేయర్' పదవి మహిళకు కేటాయించారు. అంతేకాకుండా ఈసారి మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ గా పోటీ చేసేందుకు అంగ బలం, ఆర్థిక బలం ఉంటే సరిపోదు.కార్పొరేషన్ పరిధిలో 10 డివిజన్ల పరిధిలో గల ప్రజలతో ప్రత్యక్ష పరిచయాలు, ప్రజలలో మంచి పేరు, నిజాయితీ కలిగిన నాయకత్వం అవసరం. ఈ అర్హతలు అన్ని కలిగి ఉన్న ఏకైక మహిళా నేతగా ఉషాశ్రీని చెప్పటంలో అతిశయోక్తి కానేరదు. ఎందుకంటే అన్ని అర్హతలు ఆమెకు ఉండటమే. రాజకీయాలకు విద్యార్హతలు ఉండకపోవచ్చు. కానీ, విద్యాధికులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలకు సంస్కారం అబ్బుతుంది. ప్రస్తుతం రాజకీయాలలో, ముఖ్యంగా 'మేయర్' ఉన్నత పదవిని నిర్వహించేవారు. ఉన్నత విద్యావంతులుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని గమనిస్తే పెద్దిశెట్టి ఉషాశ్రీ వంటి ఉన్నత విద్యావంతురాలు, పరిపాలన అనుభవం కలిగిన డైనమిక్ నాయకురాలు మేయర్ గా రావాల్సిన అవసరం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఉషాశ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంబిఎ చేసిన విద్యాధికురాలు.
అంతర్జాతీయ క్రీడాకారిణి..
ఉషాశ్రీ బ్యాడ్మెంటన్ క్రీడలో అంతర్జాతీయ క్రీడాకారిణి.టర్కీ, స్వీడన్ లో జరిగిన సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.మాస్టర్స్ విభాగంలో మాజీ జాతీయ ఛాంపియన్. ప్రస్తుత రాష్ట్ర ఛాంపియన్. 2025 ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన మాస్టర్స్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లో స్వర్ణ పతక విజేత. ఆంధ్ర విశ్వవిద్యాలయం బ్యాడ్మింటన్ జట్టు కెప్టెన్.బివికె కళాశాల జనరల్ కెప్టెన్. ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రీడా మండలి కార్యదర్శి కూడా. ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రసిద్ధి చెందిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి పాలకమండలి సభ్యురాలుగా ఉషాశ్రీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కాపు కులస్తులకు 'మేయర్' పీఠం
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుండి నేటి వరకు 'కాపు' కులస్తులకు మేయర్ పీఠం దక్కలేదు. గ్రేటర్ విశాఖలో అత్యధిక సంఖ్యలో ఉన్న 'కాపు'లకు మేయర్ పీఠం దక్కుతుందనే ప్రచారం జోరుగా ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే కాపు కులానికి చెందిన పెద్దిశెట్టి ఉషాశ్రీ కి మేయర్ గా పోటీ చేసే అవకాశం ఇవ్వాలనే డిమాండ్ అధికంగా ఉంది. పవన్ కళ్యాణ్ తో ప్రత్యేక అనుబంధం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణెదల పవన్ కళ్యాణ్ అంటే ఉషాశ్రీ కి తొలి నుంచి ఎంతో అభిమానం. జనసేన పార్టీ కార్పొరేటర్ గా ఇటీవల కాలం వరకు ఉషాశ్రీ పనిచేశారు. జనసేన పార్టీతో బలమైన అనుబంధం కలిగి ఉన్న ఉషాశ్రీ, గతంలో ఆ పార్టీకి ప్రచార కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2019 ఎన్నికలలో గాజువాక నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సందర్భంలో క్షేత్రస్థాయిలో ఉషాశ్రీ చురుకైన పాత్ర పోషించి, పవన్ కళ్యాణ్ దృష్టిని ఆకర్షించారు. ఈ పూర్వ రంగంలో మేయర్ గా ఉషాశ్రీని ఎంపిక కోసం పవన్ కళ్యాణ్ ఆశీస్సులు మెండిగా ఉంటాయని భావించవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జివిఎంసి మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఉషశ్రీ పేరు పరిశీలనకి వచ్చినప్పటికీ, రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల సమతూకం కారణంగా ఆమెకు ఈ పదవి దక్కలేదని తెలిసింది. ఈసారి జీవీఎంసీ మేయర్ పదవిని కాపు సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్ ఆయా వర్గాల నుంచి గట్టిగా వినిపించడంతో ఉషాశ్రీ కి మేయర్ పీఠం కేటాయించడం భావ్యమని పరిశీలకులు భావిస్తున్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.